Friday, May 13, 2016

తూర్పు గోదావరి జిల్లా జములపల్లి గ్రామ శ్రీమంతుడు పి.పి.రెడ్డి గారు


అదొక కుగ్రామం..పట్టణానికి దూరంగా వున్న పల్లె అయినా అక్కడ కరెంట్ కోత అనేది వుండదు..కరెంట్ బిల్లు అస్సలు రాదు..ప్రతి ఇంటికీ రెండు బల్బులు, ఒక ఫ్యాన్ కు విద్యుత్ ఉచితం..అక్కడి ప్రజలు మినిరలైజ్డ్ వాటరే తాగుతారు..ఊరంతా సిమెంట్ రోడ్లు..ఊరంతా నిత్యం వెలిగే వీధి దీపాలు..ఊరి మధ్యన వేయి మంది కూర్చోడానికి అనువైన కల్యాణ మంటపం(ఊరి వారికి ఉచితం)..ప్రతి ఇంటికీ అధునాతనమైన మరుగుదొడ్డి..ఊరి బడిలో పిల్లలు బల్లలపై కూర్చుని డెస్కులపై రాసుకుంటారు..అన్నట్టు సంక్రాంతి వచ్చిందంటే చాలు..ఊరందరికీ కొత్తబట్టలు పేరు పేరునా వచ్చేస్తాయ్..ఒక మాదిరిగా చదువుకున్న పిల్లాడు వుంటే చాలు వాడికి వెంటనే వుద్యోగం..ఇన్ని సౌకర్యాలు.. వసతులు వున్న ఈ ఊరు ఎక్కడో గుజరాత్ లోనో..మన వాళ్ళు జపం చేస్తున్న సింగపూరు, చైనా, జపానుల్లోనూ కాదు..అచ్చంగా మన రాష్ట్రంలో అందునా తూర్పు గోదావరి జిల్లాలో మీదు మిక్కిలి మన పిఠాపురం మండలంలోనే వుంది ఆ ఊరి పేరు “జములపల్లి” అవును ఈ ఊరిలో పైన చెప్పిన అన్ని సౌకర్యాలూ “అన్ని కులాల వారికీ అన్ని వర్గాల వారికి” అచ్చంగా అందుతున్నాయి..ఈ అద్బుతానికి ఆద్యుడు ఇదే గ్రామానికి చెందిన పి పి రెడ్డి..

ఈయన హైదరాబాద్ లోని మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అదినేత..అంత ఎత్తు ఎదిగినా.. తప్పటడుగులు వేసిన నేలను మరిచిపోలేదు.గ్రామంలో చదువుకున్న ప్రతి యువకుడికీ తన ఫ్యాక్టరీల్లో ఉపాధి కల్పించారు.కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తన గ్రామాన్నీఅద్బుతమైన సుందర వనంగా తీర్చిదిద్దారు.ఊరంతటికీ విద్యుత్ ఇచ్చే సోలార్ ప్లాంటు,రక్షిత నీరునిచ్చే ఆర్వో ప్లాంటు,కల్యాణ మంటపం,సిసి రోడ్లు నిర్మించారు.అంతటితో ఆగకుండా తన ఫ్యాక్టరీలో ఈ ఊరి కోసం ఎక్కడా లేని విధంగా రెడీమేడ్ మరుగుదోడ్లు తయారు చేయించి ప్రతి ఇంటికీ ఉచితంగా అందజేశారు . జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు.ఎప్పుడైనా పిఠాపురం వస్తే తప్పకుండా ఈ భూతల స్వర్గాన్ని చూడండి..ఎదిగిన ప్రతి పారిశ్రామిక వేత్తా.. తన గ్రామం పట్ల ఇంతటి ప్రేమ కలిగి వుంటే..వేరే సింగపూర్ లు ఎందుకూ.. ప్రతి పల్లె సింగపూరు కాదా.?? ఈ గ్రామ అభివృద్ధికి ఈ చిత్రాలే నిదర్శనం..





Source: www.ourrajahmundry.com

1 comment:

  1. తూర్పు గోదావరి జిల్లా జములపల్లి గ్రామ శ్రీమంతుడు పి.పి.రెడ్డి గారు

    ReplyDelete